క్రిష్ గుంటూరులో పుట్టి పెరిగాడు. ఈయన తాత జాగర్లమూడి రమణయ్య పోలీసు అధికారి. ఆయన సంతానం ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మనవళ్ళు, మనవరాళ్ళందరిలోకీ క్రిష్ పెద్దవాడు కావడంతో తాతగారి దగ్గర చనువు ఎక్కువగా ఉండేది. క్రిష్ చిన్నతనం నుంచే కథలు, చదవడం, రాయడం మీద ఆసక్తి ఉండేది. తండ్రి జాగర్లమూడి సాయిబాబా కు సినిమాలంటే ఆసక్తి. కొన్నాళ్ళు ఒక సినిమా థియేటర్ నడిపి గిట్టుబాటు కాక మధ్యలో వదిలేశాడు.
గుంటూరు లో ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న క్రిష్ ఫార్మసీ చదవడం కోసం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో చేరాడు. అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఫార్మసీలో ఎం. ఎస్. చేయడం కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ కూడా పుస్తకాలు బాగా చదివేవాడు, సినిమాలు చూసేవాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న కొంతమంది స్నేహితులు అతన్ని ప్రోత్సహించేవారు.[1]
వివాహం
క్రిష్ జాగర్లమూడి 2016 ఆగష్టు 7న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో డాక్టర్ రమ్య వెలగ తో వివాహం జరిగింది.[2] వారిద్దరూ విభేదాల కారణంగా 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయారు.[3]
క్రిష్ 2024 నవంబర్ 11న గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాని వివాహం చేసుకున్నాడు.[4][5]
కెరీర్
అమెరికాలో ఉన్నప్పుడే ఒక కథ రాసుకుని దాన్ని సినిమాగా తీద్దామనుకున్నాడు. అక్కడ కుదరకపోవడంతో భారతదేశానికి వచ్చి ప్రయత్నిద్దామనుకున్నాడు. మొదటగా స్నేహితుడు రాజీవ్ తో కలిసి ఫస్ట్ బిజీ సొల్యూషన్స్ అనే పేరుతో ఒక కంపెనీ స్థాపించి అది ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాజీవ్ కు అప్పగించి తాను సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఒకరికొకరు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రసూల్ ఎల్లోర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడు. అదే సమయంలో ఏదో కొత్తగా రాయాలి అనే తపన పెరిగింది. బాలీవుడ్ కోసం గాంధీ గాడ్సే కథను రాయడం మొదలుపెట్టాడు. పరిశోధన కోసం నాగపూరు, పుణె, సాంగ్లి లాంటి చోట్ల తిరిగాడు. కానీ ఆ ప్రయాణంలోనే కొన్ని అనుభవాల వల్ల తిరిగి హైదరాబాదుకు రావాలనుకున్నాడు.
ఒక చిన్న హోటల్ లో కూర్చుని గమ్యం సినిమా కథ రాసుకున్నాడు. 2008 లో,క్రిష్ అల్లరి నరేష్, శర్వానంద్, కమాలినీ ముఖర్జీ నటించిన, గమ్యంతో తన సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. అనేక ప్రసిద్ధ తెలుగు చిత్ర నిర్మాతలను ఈ చిత్రం నిర్మించటానికి నిరాకరించటంతో తన తండ్రి జాగర్లమూడి సాయిబాబా, తన సోదరుడు బిబో శ్రీనివాస్తో, అతని స్నేహితుడు రాజీవ్ రెడ్డి కలిసి గమ్యం చిత్రన్ని నిర్మించారు. ఈ చలన చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది, ఉత్తమ చిత్రం, 2009 సౌత్ ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ దర్శకుడు వంటి అనేక పురస్కారాలు గెలుచుకుంది. తమిళ భాషలో "కదలనా సుమ్మల్లా" గా కన్నడలో "సవారీ"గా, బెంగాలీలో "దుయ్ ప్రిథైబి"గా ఈ చిత్రం పునర్నిర్మించబడింది.
క్రిష్ యొక్క తదుపరి చిత్రం, వేదం, జూన్ 2010 లో థియేటర్లలో విడుదల అయింది. అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం, ఒక దశాబ్దం తర్వాత తెలుగులో మొదటి మల్టీ స్టారర్ చిత్రం. ఇది విమర్శకులు, ప్రేక్షకులచే బాగా ఆకర్షించబడింది, 58 వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో నాలుగు ప్రధాన పురస్కారాలను గెలుచుకుంది, క్రిష్ తన రెండవ ఫిలిం ఫేర్ అవార్డును ఉత్తమ దర్శకుడిగా అందుకున్నాడు. 1975 లో జీవన్ జ్యోతి తర్వాత, నాలుగు ప్రధాన పురస్కారాలు (ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు, అనుష్క శెట్టికి ఉత్తమ నటి) గెలిచిన రెండో చిత్రం కూడా, బాక్స్ ఆఫీసు వద్ద మంచి అదరణ లభించింది.
వేదం విజయం తరువాత, క్రిష్ తన తమిళ రీమేక్, వానమ్ పేరుతో దర్శకత్వం వహించడానికి సంతకం చేసారు, ఇందులో శింబు, భరత్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. వానమ్ కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. 2012 లో విడుదలైన దగ్గుబాటి రానా, నయన తార నటించిన అతని తదుపరి చిత్రం కృష్ణం వందే జగద్గురుం బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
అతని తొలి హిందీ చిత్రం సంజయ్ లీలా భన్సాలి ప్రొడక్షన్ లో "గబ్బర్ ఈజ్ బ్యాక్", 2015 ఏప్రిల్ 20 న విడుదలైంది. ఇందులో అక్షయ్ కుమార్, కరీనా కపూర్, శ్రుతి హాసన్ నటించారు. అతని రెండో ప్రపంచ యుద్ధ నేపథ్య తెలుగు చిత్రం, వరుణ్ తేజ్ నటించిన కంచె, అక్టోబరు 22 న దసరా సందర్భంగా విడుదలయినది, విమర్శకుల నుంచి మంచి సమీక్షలను సంపాదించింది. క్రిష్ దర్శకత్వం వహించిన నందమూరి బాలకృష్ణ గారి వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి 2017 జనవరి 12 లో విడుదలైనది.