దాదాభాయి నౌరోజీ
దాదాభాయ్ నౌరోజీ (హిందీ - दादाभाई नौरोजी) (సెప్టెంబర్ 4, 1825 – జూన్ 30, 1917) పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడు. ఇతను 1892 నుండి 1895 వరకు పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్‍డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగాడు. ఇతను అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి.గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందునుంచే స్వాతంత్ర్యం కోసం గళమెత్తాడు. స్వరాజ్య అనే పదం మొట్టమొదట వాడింది ఇతనే. నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఒకడు. నౌరోజీ, ఎ. ఓ. హ్యూమ్, దిన్షా ఎదుల్జీ వాచాతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించాడు.ఇతను రాసిన పుస్తకం పావర్టీ అండ్ అన్‍బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటన్ కు తరలిస్తున్న నిధుల గురించి మాట్లాడిన మొదటి పుస్తకం. భారతదేశంలో తొలితరం పారిశ్రామికవేత్తయైన జె.ఆర్.డి.టాటా లాంటి వారికి మార్గదర్శి. జీవితంనౌరోజీ 1825 సెప్టెంబరు 4 న, అప్పటి బొంబాయి రాష్ట్రంలోని నవసార (ప్రస్తుతం గుజరాత్) అనే ప్రాంతంలో ఒక పార్శీ కుటుంబంలో జన్మించాడు.[1] అతని తండ్రి పలన్ జీదోరోజి జొరాష్ట్రియన్ మతపురోహితుడు. ఎల్ఫిన్ స్టోన్ పాఠశాలలో చదివాడు.[2] బరోడా మహారాజు మూడవ శాయాజీరావు గైక్వాడ్ సహాయంతో కళాశాల విద్యనభ్యసించాడు. తర్వాత తాను చదివిన కళాశాలలోనే గణిత శాస్త్రం, తత్వశాస్త్రం బోధించే ఆచార్యుడిగా నియమితుడయ్యాడు. విద్యారంగంలో కొనసాగుతూనే వాణిజ్యంలోకి కూడా అడుగుపెట్టాడు. వ్యాపార నిమిత్తం 1855 లో ఇంగ్లండు వెళ్ళిన నౌరోజీ భారతదేశపు స్థితిగతులను ఆంగ్లేయులకు విడమరిచి చెప్పాడు. అక్కడ కొంతమంది భాగస్వాములతో కలిసి కామా అండ్ కంపెనీ అనే సంస్థను ప్రారంభించాడు. ఆ కాలంలో బ్రిటన్ లో తొలి భారతీయ కంపెనీ అదే. ఆ కంపెనీ మద్యం, నల్లమందు వ్యాపారం చేస్తుండటంతో కొద్దికాలానికి అందులోనుంచి బయటకు వచ్చాడు. 1859 లో తానే స్వంతంగా దాదాభాయి నౌరోజీ కాటన్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించాడు. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే లండన్ యూనివర్శిటీ కళాశాలలో గుజరాతీ ఆచార్యుడిగా నియమితుడయ్యాడు. భారతదేశపు రాజకీయాలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన విషయాలు చర్చించేందుకు లండన్ ఇండియన్ సొసైటీని ప్రారంభించాడు. భారతీయులు పడుతున్న కష్టాలు గురించి తెలుసుకునేందుకు ఈస్టిండియా అసోసియేషన్ ఏర్పాటు చేశాడు. ఈ సంఘాల ద్వారా భారతీయులు పడుతున్న కష్టాలను గురించి ఆంగ్లేయులపై ఒత్తిడి తేవాలని అతని ఆలోచన. వివిధ సంఘాలను ఏకం చేసి 1885 లో భారత జాతీయ కాంగ్రెస్ ని ప్రారంభించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. దానికి మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేశాడు. 1892 లో లండన్ వెళ్ళి అక్కడి లిబరల్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అలా ఎన్నికైన తొలి భారతీయుడు. పార్లమెంటులో భారతీయుల స్థితిగతులను గురించి వివరిస్తూ, అక్కడి వారికి స్వయంప్రతిపత్తి కలిగించాలని తన గళం వినిపించాడు. బ్రిటన్ భారతదేశం నుంచి సంపదను తరలించుకుపోతూ దేశాన్ని ఎలా దివాలా తీయిస్తుందో ఒక పుస్తకం రాశాడు. ఆ ప్రభావంతో ఆంగ్లేయ ప్రభుత్వం భారత్ లో పరిపాలనా సంస్కరణలు చేపట్టింది. కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా ఉన్న అతివాదులు, మితవాదులకు ఇష్టమైన వ్యక్తిగా పేరు పొందాడు. బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే లకు రాజకీయ గురువు. ఇతను 1917 జూన్ 30 న బొంబాయిలో మరణించాడు. ఒక కుటుంబంలో సమస్య వస్తే పిల్లలు తండ్రి వైపు ఎలా చూస్తారో, భారతదేశానికి సమస్య వస్తే అతని వైపు చూస్తుందని గాంధీ నౌరోజీని ప్రశంసించాడు.[1] మూలాలు
వెలుపలి లంకెలు |