ఫలాలు లేదా పండ్లు (జర్మన్: Früchte, ఫ్రెంచ్, ఆంగ్లం: Früits, స్పానిష్: Frutas ) చెట్టు నుంచి వచ్చు తిను పదార్దములు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలం లోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పడుతుంది.
ఫలదీకరణ ఫలితంగా అండాశయంతో పాటు మరియే ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దానిని 'అనృత ఫలం' అంటారు. ఉ. ఆపిల్లో పుష్పాసనం, జీడిమామిడిలో పుష్పవృంతం ఇలా ఏర్పడిన అనృత ఫలాలు.
ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు. సరళ ఫలాలలోని ఫలకవచ స్వభావాన్ని బట్టి రెండుగా విభజించారు.
కండగల ఫలాలు (Fleshy fruits) : ఈ ఫలాలలో ఫలకవచం పక్వస్థితిలో గుజ్జుగాగాని, రసయుతంగాగాని తయారవుతుంది. దీనిలో మూడు స్పష్టమైన పొరలుంటాయి. అవి- వెలుపలి వైపున ఉండే బాహ్యఫలకవచం (Epicarp), మధ్యలో ఉండే మధ్యఫలకవచం (Mesocarp), లోపలి వైపు ఉండే అంతఃఫలకవచం (Endocarp). వివిధ రకాల ఫలకవచ స్వభావం ఎక్కువ వైవిధ్యతను చూపిస్తుంది.
మృదుఫలం లేదా బెర్రి (Berry) : ఇది ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని అండాశయంనుంచి ఏర్పడి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విత్తనాలు ఉండే ఒక కండగల ఫలం. బాహ్యఫలకవచం పలుచగా ఉండి, మధ్య, అంతఃఫలకవచాలు సంయుక్తంగా గుజ్జును ఏర్పరుస్తాఅయి. ఉదా: స్ట్రాబెర్రి, వంగ, టమాటో, అరటి.
పోమ్ (Pome) : ఈ కండగల ఫలం ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని నిమ్న అండాశయం నుంచి ఏర్పడి, కండ కలిగిన పుష్పాసం చేత ఆవరించబడి ఉంటుంది. ఉదా: ఆపిల్. వాటర్ ఆపిల్[2]
పెపో (Pepo) : ఇది కుకుర్బిటేసి కుటుంబపు ముఖ్య లక్షణం. ఈ ఫలం త్రిఫలదళ సంయుక్త అండకోశంలోని ఏకబిలయుత, నిమ్న అండాశయం నుంచి ఏర్పడుతుంది. బాహ్యఫలకవచం గట్టి పొరవంటి పుష్పాసనంతో సంయుక్తమై ఫలం చుట్టూ పెచ్చులాగా ఏర్పడుతుంది. మధ్యఫలకవచం గుజ్జులాగా ఉంటుంది. అంతఃఫలకవచం మెత్తగా ఉంటుంది. అనేక విత్తనాలు ఫల కుడ్యం లోపలి తలంపై అమర్చబడి ఉంటాయి. ఉదా: దోస, గుమ్మడి.
హెస్పరీడియమ్ (Herperidium) : ఇది రూటేసి కుటుంబానికి చెందిన అతి ముఖ్యమైన కండగల ఫలం. ఇది బహుఫలదళ సంయుక్త అండకోశంలోని బహుబిలయుత, ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. దీనిలో విత్తనాలు మధ్యన ఉండే అక్షం మీద ఉంటాయి. ఫలకవచం 3 పొరలుగా విభేదన చెంది ఉంటుంది. వెలుపలగా చర్మలమైన, తైల గ్రంథులు ఉన్న బాహ్యఫలకవచం ఉంటుంది. మధ్యఫలకవచం పలుచగా, తెల్లని దూదిలాగా గాని, నారతో కూడిన పొరలాగా గాని ఉండి బాహ్యఫలకవచంతో సంయుక్తమై ఉంటుంది. అంతఃఫలకవచం అనేక గదులుగా విభజించబడి, వాటిల్లో రసయుత కేశాలు (ముత్యాలు) ఉంటాయి. ఉదా: నిమ్మజాతి పండ్లు.
టెంకగల ఫలం (Drupe) : ఇది ఒకే విత్తనం ఉన్న కండగల ఫలం. ఇది ఏక లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని ఏకబిలయుత, ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. అంతఃఫలకవచం గట్టిగా టెంకగాలా ఉండటం ఈ ఫలం ప్రధాన లక్షణం. ఉదా: మామిడి, కొబ్బరి. మామిడిలో బాహ్యఫలకవచం చర్మిలంగాను, మధ్యఫలకవచం రసభరితంగా, కొద్దిగా పీచుతో గుజ్జులాగా తినడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కొబ్బరిలో బాహ్యఫలకవచం చర్మిలంగాను, మధ్యఫలకవచం పీచులాగా ఉంటాయి. అంకురచ్ఛదం తినవలసిన భాగం.
ఒకే పుష్పంలోని బహుఫలదళ అసంయుక్త అండకోశంలోని అండాశయాల నుంచి ఏర్పడే నిజఫలాలు. ప్రతిఫలదళంలోని అండాశయం ఒక చిరుఫలంగా (Fruitlet) అభివృద్ధి చెందుతుంది. ఈ చిరుఫలాలన్నీ ఒకే పుష్పవృంతం మీద సంకలితం చెంది (గుమిగూడి) ఒక సంకలిత ఫలాన్ని ఏర్పరుస్తాయి. ఉ. సీతాఫలం
పుష్పవిన్యాసం, దాని అనుబంధ భాగాలు మొత్తం ఒకే ఫలంగా అభివృద్ధి చెందితే దాన్ని 'సంయుక్త ఫలం' అంటారు. అన్ని పుష్పాల నుంచి ఏర్పడే ఫలాలన్నీ కలసిపోయి, పక్వదశలో ఒకే ఫలంగా మారతాయి. ఇవి రెండు రకాలు.
సోరోసిస్ : కంకి పుష్పవిన్యాసం నుంచిగాని, స్పాడిక్స్ నుంచిగాని లేదా కాట్ కిన్ పుష్పవిన్యాసం నుంచిగాని ఏర్పడుతుంది. ఉ. పనస, మల్బరీ, అనాస, సరుగుడు.
సైకోనస్ : ఇది హైపన్ థోడియమ్ పుష్పవిన్యాసం నుంచి ఏర్పడే సంయుక్త ఫలం. దీనిలో పుష్పవిన్యాసవృంతం కండ కలిగిన గిన్నె వంటి నిర్మాణంగా ఏర్పడి, చూడడానికి ఒక ఫలంగా కనబడుతుంది. దీనిలోపలి అంచులలోని స్త్రీ పుష్పాలు ఫలాలుగా ఏర్పడతాయి. ఈ ఫలాలు ఎఖీన్ ల రూపంలో ఉంటాయి. ఉ. పైకస్ జాతులు
ఉపయోగాలు
=== ఆహార పదార్ధాలు ===
చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారము. ఉదా: మామిడి, పుచ్చ, ఆపిల్ మొదలైనవి. వీటిని కొంతమంది పండు మొత్తంగా గాని లేదా జామ్ ల రూపంలో తింటారు.
పండ్ల నుండి ఐస్ క్రీమ్ లు, కేకులు మొదలైనవి తయారుచేస్తారు.
కొన్ని పండ్లనుండి తీసిన ఫలరసంపానీయంగా తాగుతాము. ఉదా: నిమ్మ రసం, ఆపిల్ రసం, ద్రాక్ష రసం.
తెలుగు రాష్ట్రాల్లో విదేశీ పండ్ల సాగు (Exotic Indian fruits)
థాయ్ పింక్ పండ్లు - వీటిని మనదేశంలో కశ్మీరీ ఆపిల్ బేర్‌గా పిలుస్తున్నారు. ‘తెలంగాణ లాల్ సుందరి’ అనే బ్రాండు పేరుతో రాష్ట్ర ఉద్యానశాఖ పంట సాగు చేయిస్తోంది. థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ మొక్కలను సిద్దిపేట జిల్లా ములుగులోని పంటల ప్రయోగ క్షేత్రంలో నాటి సాగుకు ఉద్యానశాఖ ఏర్పాట్లు చేయడమేకాక ఆసక్తిగల రైతులను కూడా మొక్కలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ పండ్ల సాగుకు తెలంగాణ భూములు, వాతావరణం అనుకూలం. అందుకని శరీరానికి కావాల్సిన పోషక విలువలు ఎన్నో ఉన్న థాయ్ పింక్ పండ్లను తక్కువ ధరలో అందించగల అవకాశముంది.[10]
తైవాన్ జామ - దేశి జాతుల రకాలతో పాటు ఎన్నో రకాల జామపండ్లు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. అందులో అధిక పోషకాలు కలిగిన తైవాన్ జామకు డిమాండ్ మరింత ఎక్కువ. సేద్యం పరంగా ఈ పంట సాగు తక్కువ నీటి వినియోగంతో రైతులకు లాభసాటిగా ఉంటుంది. పైగా ప్రకృతి విధానంలో తైవాన్ జామ సాగు జరుగుతుంది. తద్వారా వినియోగదారులకు రసాయనాలు లేని చక్కని పోషకాలు కలిగిన జామపండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి.[11]
డ్రాగన్ పండు - పిటాయ మొక్కకు కాసే వాటిని డ్రాగన్ పండ్లు (ఆంగ్లం: Dragon Fruits) అని అంటారు. ఇందులో శరీరానికి శక్తినిచ్చే ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌లాంటి పోషకాలు కూడా అందుతాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఒకప్పుడు సంపన్నదేశాలకే పరిమితమైన డ్రాగాన్ ఫ్రూట్ కొంతకాలంగా ఇండోనేషియా, తైవాన్, వియత్నాం, థాయ్‌లాండ్, పిలిప్పీన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణ భారతదేశంలోనూ విరివిగా సాగు చేస్తుండడంతో అందరికీ చేరువైంది.[12] వీటి సాగుకు నీరు ఇంకిపోయే నేలలు ఉత్తమం. సుమారు 20 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం. ఇవి ఎడారిలో పెరిగే ముళ్ల చెట్లలా ఉంటాయి.
పాషన్ ఫ్రూట్ - ఇది పాసిఫ్లోరా జాతికి చెందిన మొక్కల పండు. పండులో గుజ్జు భాగం తినడానికి రుచిగా ఉంటుంది. పాషన్ ఫ్రూట్‌లను పిండుకుని కూడా జ్యూస్‌గా చేసుకోవచ్చు. పాషన్ ఫ్రూట్స్ గుండ్రంగా ఉంటాయి. అవి పసుపు, ఎరుపు, ఊదా, ఆకుపచ్చ రంగులో ఉండవచ్చు. ఈ పండ్లు పెద్ద సంఖ్యలో విత్తనాలతో కూడి జ్యూసీగా ఉంటాయి.[13][14]
↑Morton JF (1987). "Passionfruit, p. 320–328; In: Fruits of Warm Climates". NewCrop, Center for New Crops and Plant Products, Department of Horticulture and Landscape Architecture at Purdue University, W. Lafayette, Indiana. Retrieved 22 January 2020.