సెరెంగెటిసెరెంగెటి, ఉత్తర టాంజానియా, నైరుతి కెన్యాల్లో విస్తరించి ఉన్న భౌగోళిక ప్రాంతం. ఇదొక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ, వన్యప్రాణి సంరక్షిత ప్రాంతం.[1] దీని వైశాల్యం సుమారు 30,000 చ.కి.మీ. ఉంటుంది. సెరెంగెటి నేషనల్ పార్కుతో సహా, అనేక వన్యప్రాణి సంరక్షక ప్రాంతాలు సెరెంగెటిలో ఉన్నాయి. ప్రపంచంలో కెల్లా రెండవ అత్యంత విస్తృతమైన క్షీరదాల వలస ఏటా సెరెంగెటిలో జరుగుతుంది. ఆఫ్రికాలోని ఏడు సహజ అద్భుతాలలో ఒకటిగా సెరెంగెటి రూపొందడానికి ఈ వలస ఒక కారణం. ప్రపంచంలోని పది ప్రకృతి సహజ ప్రయాణ అద్భుతాలలో సెరెంగెటి ఒకటి. [2] టాంజానియాలోని సెరెంగెటి జిల్లా సెరెంగెటిలో భాగమే. సెరెంగెటి, సింహాలకు ప్రసిద్ది. సింహాల గుంపులను వాటి సహజ వాతావరణంలో చూసేందుకు వీలైన అత్యుత్తమమైన ప్రదేశాల్లో సెరెంగెటి ఒకటి. [3] సుమారు 70 పెద్ద క్షీరదాలు, 500 పక్షి జాతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. నదీతీర అడవులు, చిత్తడినేలలు, కోప్‌జేలు, గడ్డిభూములు, చిట్టడవుల వంటి ప్రకృతి వైవిధ్యం, ఈ జీవవైవిధ్యానికి కారణం. బ్లూ వైల్డెబీస్ట్‌లు, గాజెల్‌లు, జీబ్రాలు, ఆఫ్రికా గేదెలు ఈ ప్రాంతంలో సాధారణంగా కనిపించే పెద్ద క్షీరదాలు. చరిత్రసెరెంగెటిని మాసాయిలాండ్ అని కూడా పిలుస్తారు. మాసాయిలకు వీరయోధులనే పేరుంది. వీరు అనేక అడవి జంతువులతో పాటు జీవిస్తారు. కానీ ఆ జంతువులను, పక్షులను తినడానికి ఇచ్చగించరు. ఆహారం కోసం వారు పశువులపై ఆధారపడతారు. వారి బలపరాక్రమాలూ, చారిత్రికంగా వారికి ఉన్న ఖ్యాతీ వలన కొత్తగా వచ్చిన యూరోపియన్లు అక్కడి జంతువులను, వనరులను దోపిడీ చేయకుండా వెనక్కి తగ్గారు. 1890 లలో రిండర్‌పెస్ట్ అనే అంటువ్యాధి వలన, కరువుల వలన మాసాయి జనాభా, జంతువుల జనాభా బాగా తగ్గిపోయింది. 20 వ శతాబ్దంలో టాంజానియా ప్రభుత్వం న్గోరోంగోరో బిలం చుట్టూ మాసాయిలకు పునరావాసం కల్పించింది. దాంతో మానవుల వలన జరిగే వేట, అటవీ మంటలు లేకపోవడం వలన, ఆ తరువాతి 30-50 సంవత్సరాలలో దట్టమైన అటవీప్రాంతాలు, గుబురు పొదలు బాగా అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతంలో విస్తారంగా ఉన్న ట్సెట్సె ఈగల వలన ఇప్పుడు అక్కడ మానవులు పెద్దగా ఆవాసాలు ఏర్పరచుకోవడం కూడా లేదు. 1970 ల మధ్య నాటికి, వైల్డెబీస్ట్, కేప్ గేదెల జనాభా కోలుకున్నాయి. గడ్డి ఎక్కువగా పెరిగి, మంటలకు ఇంధనంగా ఉండే చెట్లు తగ్గడంతో, మంటలూ తగ్గాయి. మంటలు తగ్గడంతో అకాసియా పొదలు తిరిగి విస్తరించాయి. [4] 21 వ శతాబ్దంలో, సెరెంగెటి లోని పెంపుడు కుక్కలకు సామూహిక రాబిస్ టీకా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అంతరించిపోతున్న ఆఫ్రికన్ అడవి కుక్క వంటి వన్యప్రాణుల జాతులను కూడా రక్షించడమే కాకుండా పరోక్షంగా వందలాది మానవ మరణాలను నిరోధించారు. [5] గొప్ప వలసఏటా ఒకే కాలంలో జరిగే వైల్డెబీస్ట్‌ల వలస సెరెంగెటిలో పెద్ద ఆకర్షణ. టాంజానియాలో దక్షిణ సెరెంగెటిలోని న్గోరోంగోరో రక్షిత ప్రాంతంలో మొదలై, సెరెంగెటి జాతీయ పార్కు ద్వారా వృత్తాకారంలో సవ్యదిశలో ఈ వలస సాగుతుంది. ఉత్తర దిశగా కెన్యాలోని మసాయి మారా రిజర్వు వైపుకు తిరుగుతుంది. [6] మేత లభ్యత ననుసరించి వైల్డెబీస్ట్‌లు ఇలా వలస పోతాయి. తొలి దశ వలస జనవరి నుండి మార్చి వరకు ఉంటుంది. అప్పుడే అవి ఈనే కాలం కూడా మొదలౌతుంది. ఏపుగా పెరిగిన గడ్డి ఉండే ఈ కాలంలో ముందుగా 2,60,000 జీబ్రాలు, వాటి తరువాత 17 లక్షల వైల్డెబీస్ట్‌లు, ఆపై 4,70,000 గాజెల్‌లతో పాటు లక్షలాది ఇతర జంతువులూ ఈ మార్గంలో వలస వెళతాయి. [7] ఫిబ్రవరిలో, వైల్డెబీస్ట్‌లు సెరెంగెటి ఆగ్నేయ భాగంలో ఉండే పొట్టిగడ్డి మైదానాలలో మేత మేస్తూ గడుపుతాయి. ఇక్కడే 2 నుండి 3 వారాల వ్యవధిలో సుమారు 5,00,000 దూడలకు జన్మనిస్తాయి. కొన్ని దూడలు అంతకు కొంతకాలం ముందే పుడతాయి. అయితే, వీటిలో మనుగడ సాగించేవి కొద్ది సంఖ్యలోనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, అంతకు మూదు ఏడు పుట్టిన పెద్ద దూడలతో కలిసి ఉన్నప్పుడు ఈ చిన్న దూడలు వేటాడే జంతువులకు ఎక్కువగా చిక్కుతూంటాయి. మేలో వర్షాలు ఆగాక, జంతువులు వాయువ్య దిశలో గ్రుమేటి నది చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లడం మొదలౌతుంది. ఇక్కడ అవి జూన్ చివరి వరకు ఉంటాయి. జూలై నుండి గ్రుమేటి, మారా నదులను దాటడం మొదలౌతుంది. సందర్శకులకు ఇదొక ప్రసిద్ధ సఫారీ ఆకర్షణ. ఈ జంతువుల కోసం ఆ నదుల్లో మొసళ్ళు వేచి ఉంటాయి. జూలై / ఆగస్టు చివరికి ఈ మందలు కెన్యా చేరుకుంటాయి. ఇక ఎండాకాలమంతా అక్కడే ఉంటాయి. థామ్సన్, గ్రాంట్ యొక్క గాజెల్‌లు మాత్రం తూర్పు / పడమరలుగా చరిస్తూంటాయి. నవంబరు ఆరంభంలో, కొద్దిపాటి వర్షాలు మొదలవడంతో మళ్ళీ దక్షిణ దిశగా వలసలు మొదలై, డిసెంబరు నాటికి ఆగ్నేయంలోని పొట్టిగడ్డి మైదానాలకు వెళ్తాయి. మళ్ళీ ఫిబ్రవరిలో దూడలను ఈనేందుకు సిద్ధమౌతాయి. [8][9] టాంజానియా నుండి నైరుతి కెన్యాలోని మాసాయి మారా జాతీయ రిజర్వుకు జరిగే 800 కిలోమీటర్ల ఈ వలస ప్రయాణంలో ఏటా సుమారు 2,50,000 వైల్డెబీస్ట్‌లు మరణిస్తూంటాయి. దాహానికి, ఆకలికి, అలసటకూ, వేటాడే జంతువులకూ అవి బలౌతూంటాయి. [2] పర్యావరణంసెరెంగెటి తూర్పు ఆఫ్రికాలోని అత్యుత్తమ వేట జంతువుల ప్రాంతం. గొప్ప గొప్ప వలసలకు ప్రసిద్ది చెందడంతో పాటు, పుష్కలంగా ఉండే పెద్ద మాంసాహార జంతువులకు కూడా సెరెంగెటి ప్రసిద్ది చెందింది. ఈ పర్యావరణ వ్యవస్థలో 3,000 సింహాలు, 1,000 చిరుతపులులు, [10] 7,700 నుండి 8,700 వరకూ మచ్చల హైనాలూ ఉన్నాయి. [11]. తూర్పు ఆఫ్రికా చిరుత కూడా సెరెంగెటిలో ఉంది. సెరెంగెటిలో అడవి కుక్కలు చాలా తక్కువ -మరీ ముఖ్యంగా సెరెంగెటి నేషనల్ పార్క్ (1992 లో అవి అంతరించిపోయాయి) వంటి ప్రదేశాలలో. ఇక్కడ ఎక్కువగా ఉండే సింహాలు, మచ్చల హైనాలూ అడవి కుక్కల ఆహారాన్ని దొంగిలించి, వాటి మరణాలకు ప్రత్యక్ష కారణం అయ్యాయి. [12] ఆఫ్రికన్ గేదె, వార్థాగ్, గ్రాంట్ దుప్పి, ఇలాండ్, వాటర్‌బక్, టోపీ వంటి వివిధ గడ్డి మేసే జంతువులకు సెరెంగెటి నిలయం. ఈ జంతుజాతులన్నీ ఒకదానికొకటి దగ్గరి సంబంధం కలిగినవే అయినప్పటికీ, వీటి ఆహారాలు విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, వైల్డెబీస్ట్‌లు పొట్టిగడ్డిని తినడానికి ఇష్టపడతాయి. జీబ్రాలు పొడవుగడ్డిని ఇష్టంగా తింటాయి. అదేవిధంగా, డిక్-డిక్స్ చెట్లకు కిందుగా వేలాడే ఆకులనే తింటాయి. ఇంపాలాలు చెట్ల పైయెత్తున ఉండే ఆకులను తింటాయి. జిరాఫీలు ఇంకా ఎత్తున ఉండే ఆకులను తింటాయి. ఈ విధంగా వీటీ ఆహారపు అభిరుచులు విభిన్నంగా ఉండడం చేత, సెరెంగెటి వీటన్నిటినీ పోషించగలుగుతోంది. టాంజానియా, కెన్యా ప్రభుత్వాలు జాతీయ ఉద్యానవనాలు, పరిరక్షణ ప్రాంతాలు, జంతువుల రిజర్వులతో సహా అనేక రక్షిత ప్రాంతాలను నిర్వహిస్తున్నాయి. ఇవి సెరెంగెటిలో 80 శాతానికి పైగా ప్రాంతానికి చట్టపరమైన రక్షణ కలిగిస్తున్నాయి. న్గోరోంగోరో సంరక్షిత ప్రాంతం లోని ఎత్తైన ప్రదేశాల వలన సెరెంగెటి లోని ఆగ్నేయ ప్రాంతం వర్షచ్ఛాయాప్రదేశంలో ఉంది. ఇక్కడ చెట్లు లేని పొట్టిగడ్డి మైదానాలు, చిన్న డికోట్లు సమృద్ధిగా ఉంటాయి. నేలల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. [13] మైదానాల్లో వాయవ్య దిశగా పోతూ ఉంటే, నేల పైపొర లోతు పెరుగుతూ పోతుంది. ఇక్కడ పొడవైన గడ్డి పెరుగుతుంది. సుమారు 70 కిలోమీటర్లు పశ్చిమాన, అకస్మాత్తుగా అకాసియా పొదలు మొదలై, పశ్చిమాన విక్టోరియా సరస్సు వరకు, ఉత్తరాన మాసాయి మారా నేషనల్ రిజర్వుకు ఉత్తరాన ఉన్న లోయిటా మైదానాల వరకు విస్తరించి ఉంటాయి. ఈ ప్రాంతంలో పదహారు అకాసియా జాతులు ఉంటాయి. ఎడాఫిక్ పరిస్థితుల కనుగుణంగా ఇవి విస్తరించి ఉంటాయి. విక్టోరియా సరస్సు సమీపంలో, పురాతన సరస్సు గర్భాల నుండి వరద మైదానాలు అభివృద్ధి చెందాయి. సుదూర వాయవ్య ప్రాంతంలో, నేలల్లో వచ్చిన మార్పుల కారణంగా అకాసియా అడవుల స్థానంలో వెడల్పాటి ఆకులు కలిగిన టెర్మినాలియా-కాంబ్రెటమ్ అడవులు కనిపిస్తాయి. మొత్తం సెరెంగెటి లోనే, ఈ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఎండాకాలం చివరిలో వలస వెళ్ళే గిట్టల జంతువులు ఇక్కడ ఆశ్రయం పొందుతాయి. సెరెంగెటిలో భూమి, సముద్ర మట్టం నుండి 920 - 1850 మీటర్ల ఎత్తున ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 15 నుండి 25 oC ఉంటుంది. శీతోష్ణస్థితి సాధారణంగా వేడిగా, పొడిగా ఉన్నప్పటికీ, ఏటా రెండుసార్లు వర్షాకాలం వస్తుంది. మార్చి నుండి మే వరకు ఒకసారి, అక్టోబరు నవంబర్లలో కొద్ది కాలం పాటూ వర్షం పడుతుంది. న్గోరోంగోరో ఎత్తైన ప్రాంతం లోని "లీ" లో 508 మి.మీ. నుండి విక్టోరియా సరస్సు ఒడ్డున 1200 మిమీ. వరకు వర్షపాతం మారుతూ ఉంటుంది. మాంటానే అడవులతో కూడుకుని ఉండే ఎత్తైన ప్రాంతాలు మైదానాల కంటే చాలా చల్లగా ఉంటాయి. సెరెంగెటి ఉన్న బేసిన్‌కు ఇవి తూర్పు సరిహద్దున ఉంటాయి. సెరెంగెటి నేలలో గ్రానైట్, నీస్ రాళ్ళు నేలపైకి పొడుచుకుని వచ్చి (అవుట్ క్రాపింగ్స్) ఉంటాయి. వీటిని కోప్జె అని పిలుస్తారు. అగ్నిపర్వత కార్యకలాపాల ఫలితం గానే ఈ రాళ్ళు ఏర్పడ్డాయి. మైదాన ప్రాంతాల్లో జీవించని వన్యప్రాణులకు ఈ కోప్జెలు ఆవాసాలుగా ఉంటాయి. సెరెంగెటి సందర్శకులకు కనువిందు చేసే ఒక కోప్జే జంతువు సింబా కోప్జే (కోప్జే సింహం). న్గోరోంగోరో సంరక్షిత ప్రాంతంలో న్గోరోంగోరో క్రేటర్, ఓల్దువై గార్జ్‌లు ఉన్నాయి. ఇక్కడ అనేక పురాతన హోమినిన్ శిలాజాలను కనుగొన్నారు. మూలాలు
బాహ్య లంకెలువికీమీడియా కామన్స్‌లో Serengetiకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి. |