కర్పూరీ ఠాకూర్
కర్పూరీ ఠాకూర్ (1924 జనవరి 24 - 1988 ఫిబ్రవరి 17) బీహార్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, మొదట 1970 డిసెంబరు నుండి 1971 జూన్ వరకు, ఆపై 1977 జూన్ నుండి 1979 ఏప్రిల్ వరకు అతను ఆ పదవిలో కొనసాగాడు. అతనికి కేంద్రప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ 2024 జనవరి 23న ఒక ప్రకటన విడుదల చేసింది.[1] జీవిత చరిత్రకర్పూరీ ఠాకూర్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పితౌంజియా (ప్రస్తుతం కర్పూరి) గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్‌దులారి దేవి దంపతులకు జన్మించాడు.[2][3][4] అతను మహాత్మా గాంధీ, సత్యనారాయణ సిన్హాచే ప్రభావితమయ్యాడు.[5][6] అతను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరి విద్యార్థి నాయకుడిగా[7], క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు, అతను 26 నెలల జైలు జీవితం గడిపాడు.[8] భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతను 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా బీహార్ విధానసభ సభ్యుడు అయ్యాడు. 1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సందర్భంగా పి అండ్ టి ఉద్యోగులకు నాయకత్వం వహించినందుకు అరెస్టయ్యాడు. 1970లో, అతను టెల్కో కార్మికుల ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు.[8] హిందీ భాషపై తనకున్న విశ్వాసంతో బీహార్ విద్యా మంత్రిగా మెట్రిక్యులేషన్ పాఠ్యాంశాలకు ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా తొలగించాడు. అతను 1970లో బీహార్‌లో మొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ముందు బీహార్‌లో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేశాడు. అతని హయాంలో, బీహార్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో అతని పేరు మీద అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. అతను సంయుక్త సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసాడు. లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి ప్రముఖ బీహారీ నాయకులకు అతను గురువుగా కీర్తిపొందాడు.[9] 1984లో ప్రారంభించబడిన దళిత మజ్దూర్ కిసాన్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. రాజకీయంకర్పూరీ ఠాకూర్ 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికతో ప్రారంభమైన రాజకీయ జీవితం (1977 పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనప్పుడు, 1984 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సమయం మినహా) 1988లో మరణించే వరకు శాసనసభ్యునిగా ఉన్నాడు. ఠాకూర్ 1967 మార్చి 5 నుంచి 1968 జనవరి 28 వరకు బీహార్ విద్యాశాఖ మంత్రిగా,1970 డిసెంబరులో సంయుక్త సోషలిస్టు పార్టీతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, కాని అతని ప్రభుత్వం ఆరు నెలల తరువాత పడిపోయింది. 1977 జూన్ లో తిరిగి పదవిని చేపట్టినా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేయలేక, దాదాపు రెండేళ్లలో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇందుకు ప్రధానకారణం అతను అమలు చేసిన రిజర్వేషన్ విధానం వల్ల జరిగిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటారు. కర్పూరీ ఠాకూర్ విధానపరమైన నిర్ణయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, అతని సచ్చీలత (క్లిన్ ఇమేజ్), మచ్చలేని రాజకీయ నాయకుడిగా వ్యక్తిగతంగా గౌరవించబడ్డారు.[10] మరణంకర్పూరి ఠాకూర్ 64 సంవత్సరాల వయసులో 1988 ఫిబ్రవరి 17న గుండెపోటుతో మరణించాడు. మూలాలు
|