ప్రణబ్ ముఖర్జీ
ప్రణబ్ కుమార్ ముఖర్జీ (1935 డిసెంబరు 11 - 2020 ఆగస్టు 31) భారతదేశ రాజకీయ నాయకుడు. అతను భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను భారత జాతీయ కాంగ్రెస్లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.[1] రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా అతనుకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటూంటాయి. 1969లో జరిగిన కాంగ్రెస్ సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యే అవకాశం కల్పించింది. ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలో స్థానం పొందాడు. 1976 –77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితిలో జరిగిన దురాగతాల విషయంలో కాంగ్రెస్ పార్టీలోను మిగతా కాంగ్రెసు నాయకుల వలెనే అతను కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అనేక మంత్రి స్థాయి పదవులు నిర్వర్తించిన ముఖర్జీ సేవలు 1982–84 లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పనిచెయ్యడంతోముగిసాయి. 1980–85 లో రాజ్యసభ నాయకునిగా పనిచేసాడు. 1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్ నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినా రాజీవ్ గాంధీ హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో ఇందిరా గాంధీ హత్య తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి రాజీవ్‌గాంధీతో రాజీ కుదరడంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో పి.వి.నరసింహారావు ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రణబ్‌ను నియమించిన పి.వి.నరసింహారావు 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్ అప్పటి నుంచీ కేబినెట్‌లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. సోనియా రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖకు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో తాను రాజీనామా చేసేవరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్నాడు. అతను అనేక కీలకమైన కేబినెట్ మత్రిత్వ పదవులను చేపట్టాడు. రక్షణ శాఖా మంత్రి (2004–06), విదేశీ వ్యవహారాల మంత్రి (2006–09), ఆర్థిక మంత్రి (2009–12) గా తన సేవలనంచించాడు. అతను లోక్‌సభకు నాయకునిగా కూడా పనిచేసాడు. జూలై 2012 న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యు. పి. ఎ) అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అతను రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి వోట్లను పొంది ప్రత్యర్థి పి.ఎ.సంగ్మాను ఓడించాడు. 2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మరలా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పైబడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం 2017 జూలై 25 న ముగిసింది.[2][3][4] అతని తరువాత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యాడు. జీవిత విశేషాలుప్రణబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న పశ్చిమ బెంగాల్ లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[5] అతని తండ్రి కమద కింకర ముఖర్జీ భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీల సభ్యుడు. అతని తండ్రి 1952 నుండి 1964 వరకు పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యునిగా, ఎ. ఐ. సి. సి సభ్యునిగా ఉన్నాడు. అతని తల్లి రాజ్యలక్ష్మీ ముఖర్జీ.[6][7][8] అప్పటి కాలంలో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సూరి (బిర్భుమ్) లోని సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివాడు.[9] తరువాత రాజనీతి శాస్త్రం, చరిత్రలో ఎం.ఎ. చేసాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందాడు.[7] అతను 1963 లో కలకత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (తపాలా, టెలిగ్రాఫ్) కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యు. డి. సి) ఉద్యోగంలో చేరాడు. తరువాత విద్యానగర్ కళాశాలలో రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకునిగా విధులను నిర్వర్తించాడు.[10] అతను రాజకీయాలలోనికి రాక పూర్వం దేషెర్ దక్ పత్రికకు జర్నలిస్టుగా ఉండేవాడు.[11] ప్రారంభ రాజకీయ జీవితం1969 లో మిడ్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి వి. కె. కృష్ణ మేనన్కు ప్రచార బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం ప్రారంభమయింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అతని ప్రతిభను గుర్తించి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పించింది.[12] అతను 1969 లో భారత పార్లెమెంటులో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చాడు.[9] గాంధీ కుటుంబ విధేయునిగా అతను తనకు తాను "అన్ని ఋతువులలో మనిషి"గా అభివర్ణించుకున్నాడు.[13] 1973లో తొలిసారిగా ఇందిరా గాంధీ కేబినెట్ లో పరిశ్రమల అభివృద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం వేగంగా ఎదిగింది. 1975–77 లలో వివాదాస్పద అంతర్గత అత్యవసర పరిస్థితి వచ్చినపుడు అతను కేబినెట్ లో క్రియాశీలకంగా ఉన్నాడు. "సాంప్రదాయిక పరిపాలన నియమాలు, నిబంధనలను ఉల్లంఘించినందున" అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయనాయకులతో పాటు ముఖర్జీ కూడా అరోపణలు ఎదుర్కొన్నాడు. తరువాత జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కొత్తగా ఏర్పడిన జనతా ప్రభుత్వం ముఖర్జీపై నేరారోపణ చేస్తూ షా కమిషన్ ను నియమించింది. అయితే, 1979లో ఆ కమిషనే తన "అధికార పరిధిని అతిక్రమించిందని" ఆరోపణలు ఎదుర్కొంది. తనపై వచ్చిన ఆరోపణల నుంచి ముఖర్జీ సురక్షితంగా బయటపడ్డాడు. తరువాత 1982 నుండి 1984 మధ్య ఆర్థిక మంత్రిగా తన సేవలనంచించాడు.[14][15] ప్రభుత్వ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంలో అతని పనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇది భారత దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.ఎం.ఎఫ్) మొదటి ఋణం చివరి వాయిదా సొమ్ము రావడానికి దోహదపడింది.[16] ఒక ఆర్థిక మంత్రిగా అతను భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా మన్మోహన్ సింగ్ను నియమించే పత్రంపై సంతకం చేసాడు.[12] 1979లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ నాయకునిగా ఉన్నాడు. 1980లో సభా నాయకుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టాడు.[9] ప్రణబ్ ముఖర్జీ అగ్ర శ్రేణి క్యాబినెట్ మంత్రిగా పరిగణింపబడ్డాడు. అతను ప్రధాన మంత్రి లేని సమయంలో కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి ఎదిగాడు. ఇందిరా గాంధీ హత్య తరువాత ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడు. ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ కంటే రాజకీయాల్లో ముఖర్జీ ఎక్కువ అనుభవం కలిగి ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ పార్టీపై పట్టు సాధించాడు. ముఖర్జీ క్యాబినెట్లో తన స్థానాన్ని కోల్పోయాడు. పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని నిర్వహించడానికి పంపబడ్డాడు. తనను తాను ఇందిరాగాంధీ వారసుడిగా భావించాడు. పార్టీ లోని రాజీవ్ గాంధీ వ్యతిరేకులతో జట్టు కట్టినందున ముఖర్జీ పార్టీ నుండి బహిష్కృతుడయ్యాడు.[13][17] 1986లో ముఖర్జీ రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ (ఆర్. ఎస్. సి) ను పశ్చిమ బెంగాల్ లో స్థాపించాడు. మూడు సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీతో జరిపిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరినందున ఆర్.ఎస్.సి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసాడు. ఆర్. ఎస్. సి పార్టీ 1987 ఎన్నికలలో పశ్చిమబెంగాల్ లో తీవ్ర రూపంలో అవతరించింది. అనేకమంది విశ్లేషకులు, ముఖర్జీకి జనాకర్షణ లేదని అందువలన అతను గొప్ప నాయకుడిగా రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చలేరని ఆరోపించారు.[13] తరువాత అతను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు అతను "7 రేస్ కోర్సు రోడ్ ఎప్పుడూ తన గమ్యం కాదు" అని సమాధానమిచ్చాడు.[18] 1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత అతని రాజకీయ జీవితం పునరుద్ధరించబడింది. అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు అతనిని భారత ప్లానింగ్ కమిషన్ కు డిప్యూటీ చైర్మన్ పదవినిచ్చాడు. తరువాత మొదటి సారి పి. వి. నరసింహారావు కేబినెట్ లో 1995 నుండి 1996 వరకు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[9] గాంధీ విధేయుడిగా ముఖర్జీ సోనియా గాంధీ రాజకీయ ప్రవేశానికి ప్రధాన పాత్ర పోషించాడు. ఆమెకు రాజకీయ గురువుగా బాధ్యతలను చేపట్టాడు.[13] అతను 1998–99 లో ఎ.ఐ.సి.సికి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. తరువాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. అతను 2010లో రాజీనామా చేసే వరకు పశ్చిమ బెంగాల్ కు అధ్యక్షునిగా ఉన్నాడు. అతను 1985 లో కూడా ఇదే పదవిని నిర్వహించాడు.[7] ముఖర్జీ 2004లో లోక్‌సభ నాయకునిగా ఉన్నాడు.[9] అతను పశ్చిమ బెంగాల్ లోని జంగిపూర్ పార్లెమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి 2009 వరకు పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. 2004 లో సోనియా గాంధీ అనూహ్యంగా ప్రధానమంత్రి స్థాయిని తిరస్కరించిన తర్వాత ముఖర్జీని భారతదేశ ప్రధానమంత్రిగా చేస్తారని ఊహాగానాలు జరిగాయి.[19] అయితే, సోనియా గాంధీ చివరికి మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిగా నియమించింది.[17] 2007 రాష్ట్రపతి ఎన్నికలలో ముఖర్జీ పేరు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి కొద్దికాలం పాటు పరిగణించబడింది. కానీ కేంద్ర కేబినెట్లో ఆచరణాత్మకంగా అతని అవసరం ఎంతో ఉన్నందున అతని పేరును ప్రతిపాదించలేదు.[17] ముఖర్జీ మన్ మోహన్ సింగ్ ప్రభుత్వంలో అనేక ముఖ్య పదవులను చేపట్టాడు. రక్షణ, ఆర్థిక, విదేశాంగం వంటి కీలక శాఖలను నిర్వహించాడు. ముఖర్జీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులతో కూడిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి నాయకత్వం వహించాడు. లోక్‌సభ నాయకునిగా, పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా తన సేవలనందించాడు.[9] 2012 లలో రాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థిగా ఎంపిక కావడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండేందుకు క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ నుండి పదవీ విరమణ చేసాడు.[20] ఆర్థికశాఖ మంత్రిపదవిని నిర్వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేసి అధికారపార్టీ తరఫున దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి పోటీచేసి విజయం సాధించారు. 2012 జూలై 25న 13వ రాష్ట్రపతిగా పదవిని అలంకరించాడు. రాజకీయ పార్టీలో పాత్రప్రణబ్ ముఖర్జీని పార్టీ సామాజిక వర్గాల్లో బాగా గౌరవించారు.[21] అతను 1978 జనవరి 27 న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. అదే సంవత్సరం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎ. ఐ. సి. సి) సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో సభ్యునిగా చేరాడు. 1978 లో ఎ.ఐ.సి.సి, కాంగ్రెస్ లలో కోశాధికారిగా పనిచేసాడు.[7] 1984, 1996, 1998 జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో ఎ. ఐ. సి. సి ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమింపబడ్డాడు. 1999 జూన్ 28 నుండి 2012 వరకు ఎ. ఐ. సి. సి సెంట్రల్ కోఆర్డినెషన్ కమిటీకి చైర్మన్ బాధ్యతలను నిర్వహించాడు. 2001 డిసెంబరు 12 న అతను సెంట్రల్ ఎన్నికలు కమిటీకి నియమింపబడ్డాడు. 1998 లో అతను ఎ.ఐ.సి.సి జనరల్ సెక్రటరీగా నియమితులయ్యాడు.[7] 1997 లో ముఖర్జీ భారత పార్లమెంటరీ సమూహం చే "అత్యుత్తమ పార్లమెంటేరియన్"గా గుర్తింపబడ్డాడు. సోనియా గాంధీ రాజకీయాల్లో చేరడానికి అయిష్టంగా అంగీకరించిన తరువాత, ముఖర్జీ ఆమె సలహాదారులలో ఒకరిగా మారాడు. ఇందిరాగాంధీ ఏయే సమస్యను ఎలా పరిష్కరించేవారో, .ఏ సంక్షోభంలో ఎలా వ్యవహరించేవారో ప్రణబే సోనియాకు చెప్పాడు. అలా సోనియాకు మొట్టమొదటి రాజకీయ గురువుగా వ్యవహరించాడు. అదే సమయంలో పార్టీకీ, సోనియాకూ విధేయంగానూ ఉంటూ వచ్చాడు.[22] కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. 2005 ప్రారంభంలో పేటెంట్ సవరణ బిల్లు కోసం జరిగిన చర్చల సమయంలో అతని ప్రతిభను ప్రదర్శించాడు. కాంగ్రెస్ పార్టీ IP బిల్లును ఆమోదించడానికి కట్టుబడి ఉంది, కానీ వారి కూటమి యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్ మిత్ర పక్షమైన వామపక్షాలు మేధో సంపద గుత్తాధిపత్య అంశాలను వ్యతిరేకించాయి. ఒక రక్షణ మంత్రిగా ప్రణబ్, ఈ వ్యవహారంలో అధికారికంగా పాల్గొనలేదు కానీ అతని సంధి నైపుణ్యాల ఫలితంగా ఆ బిల్ కదిలించడానికి కృషి చేసాడు. అతను సిపిఐ-ఎం నాయకుడైన జ్యోతిబసు వంటి వారితో సహా పలు పాత మిత్రపక్షాలతో పొత్తులు కొనసాగించి కొత్త మధ్యవర్తిత్వాన్ని ఏర్పరచాడు. తన సహచరుడైన కమల నాథ్ కు " చట్టం పూర్తిగా లేని దాని కంటే అసంపూర్ణ చట్టం మెరుగైనది" అని చెప్పి ఒప్పించగలిగాడు.[23] చివరకు 2005 మార్చి 23 న ఆ బిల్లు ఆమోదించబడింది. భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం (123 ఒప్పందం) పై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేసారు. ఈ ఒప్పందం వల్ల దేశానికి ఇంధన భద్రత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విపక్షాలు మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని యూపీఏ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని, దీనివల్ల భవిష్యత్‌లో అణు పరీక్షలు నిర్వహించే హక్కును దేశం కోల్పోతుందని మండిపడ్డాయి. 2008లో మన్మోహన్‌సింగ్ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి విశ్వాస తీర్మానంలో విజయం సాధించి యు. పి. ఎ II ప్రభుత్వం రక్షింపబడటానికి ఈ ఒప్పందం దోహదపడింది.[24] 2008-09 లో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బై-పాస్ సర్జరీకి వెళ్లినపుడు ముఖర్జీ లోక్‌సభ ఎన్నికలకు ముందు క్యాబినెట్ ను నడిపించే కీలక పాత్రను పోషించాడు. ఈ సమయంలో అతను రాజకీయ వ్యవహారాలు కేబినెట్ కమిటీకి చైర్మన్ గాను, ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్రమంత్రిగా అదనపు బాధ్యతలను స్వీకరించాడు. అతను 2011లో "ఉత్తమనిర్వహణాధికారి" పురస్కారాన్ని పొందాడు. ప్రభుత్వ కార్యాలయాలురక్షణ మంత్రి2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీని రక్షణ మత్రిగా నియమించింది. అతను 2006 వరకు ఈ శాఖా బాధ్యతలను చేపట్టాడు. అతను తన పదవీకాలంలో యునైటెడ్ స్టేట్స్తో సహకారాన్ని విస్తరించాడు. 2005 జూన్ లో ముఖర్జీ 10 సంవత్సరాల ఇండో-యుఎస్ డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేసాడు.[25] యునైటెడ్ స్టేట్స్ తో సహకారం పెరుగుతున్నప్పటికీ, రష్యా భారతదేశ 'అగ్రశ్రేణి' రక్షణ భాగస్వామిగా ఉండేవిధంగా ముఖర్జీ సంబంధాలను కొనసాగించాడు. 2005 అక్టోబరులో భారతదేశంతోని రాజస్థాన్‌లో మొదటి ఉమ్మడి వ్యతిరేక తీవ్రవాద యుద్ధ ఎత్తుగడలను రష్యా నిర్వహించింది. ఈ సమయంలో ముఖర్జీ, రష్యా రక్షణ మంత్రి సెర్జెల్ ఇవనోవ్ లు ఒక భారీ మోర్టార్ వారి వేదిక నుండి కొన్ని మీటర్ల పడిన దూరంలో పడిన సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు.[26] విదేశీ వ్యవహారాల మంత్రిముఖర్జీ 1995 లో విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమింపబడ్డాడు. అతని నాయకత్వంలో ప్రధాని నరసింహారావు ప్రారంభించిన "లుక్ ఈస్ట్ ఫారిన్ పాలసీ"లో భాగంగా పశ్చిమాసియా దేశాల అసోసియేషన్ కు "పూర్తి సంభాషణ భాగస్వామి"గా తయారయ్యాడు. 1996లో అతను ఈ స్థానాన్ని విడిచిపెట్టాడు. 2006లో ముఖర్జీ రెండవ సారి ఈ పదవిని చేపట్టాడు. అతను అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వంలో "యు.ఎస్-ఇండియా సివిల్ నూక్లియర్ అక్రిమెంటు" పై సంతకం చేసాడు. 2006 ఆగస్టులో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ''పూర్తి స్థాయి పౌర అణు సహకారానికి'' అంటే అణు ఇంధనం, అణు రియాక్టర్ల నుంచి ఉపయోగించిన ఇంధన రీప్రాసెస్ వరకూ అంటే పూర్తి స్థాయి అణు ఇంధన చక్రంలోని అన్ని అంశాలకు సంబంధించి హామీ కల్పిస్తుందని పార్లమెంటుకు హామీ ఇచ్చాడు. అయితే వాస్తవానికి, అటువంటి పూర్తి స్థాయి అణు సహకారానికి హామీ ఏమీ ఇవ్వలేదని సంతకాలు జరిగిన 123 ఒప్పందం ద్వారా స్పష్టమైంది. దానికి బదులుగా, పూర్తి స్థాయి అంతర్జాతీయ రక్షణలు వున్నప్పటికీ అణు సరఫరాదారుల గ్రూపుతో కలిసి అమెరికా ''ఎన్‌రిచ్‌మెంట్, రీప్రాసెసింగ్ పరిజ్ఞానానికి'' సంబంధించిన సాంకేతికతను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. సాంకేతిక పరిజ్ఞానం నిరాకరణ ఇలానే కొనసాగుతోంది. రక్షణ సహకార ఒప్పందం కింద కూడా సున్నితమైన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంపై ఆంక్షలు తొలగింపచేయడంలో భారత్ విఫలమైంది.[27] 2008 ముంబయి దాడుల తరువాత పాకిస్తాన్ పై ప్రపంచ అభిప్రాయాన్ని సమీకరించడంలో కీలక పాత్ర పోషించాడు.[11] వాణిజ్య మంత్రిముఖర్జీ మూడుసార్లు భారత వాణిజ్య మంత్రిగా ఉన్నాడు. మొదటి సారి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1980-82 మధ్య కాలంలో, 1984లో రెండవసారి ఈ బాధ్యతలను చేపట్టాడు.[9] 1990లోమూడవసారి ఈ పదవిని చేపట్టాడు. ప్రపంచ వాణిజ్య సంస్థ స్థాపనకు దారితీసిన చర్చలకు అతను గణనీయంగా దోహదపడ్డాడు.[11] ఆర్థిక మంత్రిప్రణబ్ ముఖర్జీ 1982 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో భారత ఆర్థిక మంత్రిగా మొదటిసారి పనిచేశాడు. అతను 1982-83 లో మొదటి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని మెరుగుపరుచుకోవటానికి, భారతదేశ మొట్టమొదటి అంతర్జాతీయ ద్రవ్యనిథి అందిస్తున్న ఋణం చివరి విడతకు విజయవంతంగా తిరిగి రాబట్టడానికి అతను కృషిచేసాడు.[16] ఆతను 1982 లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ సింగ్ నియామక పత్రంపై సంతకం చేసాడు.[12] అంబానీ-వాడియా పారిశ్రామిక కలహాలలో తను పోత్సాహం ఉన్నట్లు ఆరోపింపబడ్డాడు.[28] భారతీయ ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదట సంస్కర్తగా ప్రణబ్ ముఖర్జీ గుర్తింపు పొందాడు. 1980లలో అతను పి.వి.నరసింహారావు, మన్‌మోహన్ సింగ్ అధ్వర్యంలో ముఖర్జీ అప్పటి పారిశ్రామిక వంత్రి ఛరణ్‌జిత్ ఛనానాతో కలసి సరళీకృత విధానాలను ప్రారంభించినట్లు "ఇండియా టుడే" పత్రిక ప్రచురించింది.[24] వామపక్ష పత్రిక "ముఖర్జీ ధూమపానం నుండి సోషలిజం పెరగలేదు" అని వ్యాఖ్యానించింది.[24] 1984లో రాజీవ్ గాంధీచే ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి తొలగించబడ్డాడు. భారతదేశాన్ని పాలించడానికి తన సొంత బృందాన్ని తీసుకురావాలని రాజీవ్ గాంధీ కోరుకున్నాడు.[20] ప్రపంచంలోఅత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వేలో గుర్తించబడినప్పటికీ అతనిని పదవి నుండి తొలగించారు.[16] పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టాడు. అతడు ప్లానింగ్ కమిషనుకు డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడ్డాడు. భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి, డిప్యూటీ చైర్ పర్సన్ స్థానం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 1991-96 మధ్య అతని పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలను లైసెన్సు రాజ్ వ్యవస్థ ముగిసే వరకు చేసాడు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగపరచడానికి దోహదపడింది.[29] 2009లో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. అతను 2009. 2010,2011 ల వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టాడు. 2008-09లో 6.5% నుండి 2010–11 బడ్జెట్లో GDP అనుపాతంగా ప్రజా రుణాన్ని తగ్గించటానికి దేశ మొట్టమొదటి స్పష్టమైన లక్ష్యాన్ని చేర్చాడు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో బడ్జెట్ లోటు 4.1 శాతానికి తగ్గించాలని ముఖర్జీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.[30] ముఖర్జీ అనేక పన్ను సంస్కరణలను అమలుచేశాడు. అతను ఫ్రింజ్ బెనిఫిట్స్ టాక్స్, కమోడిటీస్ ట్రాన్సాక్షన్ టాక్సులను రద్దు చేశాడు. అతను తన పదవీకాలంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ పన్నును అమలు చేశాడు. ఈ సంస్కరణలు ప్రధాన కార్పొరేట్ అధికారులు, ఆర్థికవేత్తలచే ప్రసంశలు పొందాయి. ముఖర్జీచే పునరావృత్త పన్నుల పరిచయం జరిగింది అయితే కొందరు ఆర్థికవేత్తలు దీనిని విమర్శించారు.[31] ముఖర్జీ "జవహర్ లాల్ నేషనల్ అర్బన్ రెనెవల్ మిషన్"తో పాటు అనేక సామాజిక రంగ పథకాలు నిధులను విస్తరించాడు. అతను అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడానికి బడ్జెట్ పెరుగుదలకు కూడా సహాయాన్నందించాడు. అతను "నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రోగ్రాం" వంటి మౌలిక సదుపాయాల కార్యక్రమాలు విస్తరించాడు. తన పదవీకాలంలో విద్యుత్ కవరేజ్ కూడా విస్తరించింది. ప్రభుత్వ వ్యయంలో విస్తరణ తాత్కాలికమేనని ముఖర్జీ ప్రకటించాడు. 2010లోముఖర్జీ "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్ ఫర్ ఆసియా" పురస్కారాన్ని ప్రపంబ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిథి చ దిన పత్రిక "ఎమర్జింగ్ మార్కెట్స్" చే అందుకున్నాడు. "తన ఇంధన ధరల సంస్కరణలు, ఆర్థిక పారదర్శకత, సంఘటిత వృద్ధి వ్యూహాల వల్ల, అతను ముఖ్య వాటాదారులచే ప్రేరణ పొందాడు" అని ప్రశంసించారు.[32] అతనిని "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్"గా ఆంగ్ల మాస పత్రిక "ద బ్యాంకర్" గుర్తించింది.[30] ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖర్జీ చివరి సంవత్సరాలు విజయవంతం కాలేదు. ఇతర స్థానాలుముఖర్జీ కోల్‌కతా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ కు చైర్మన్ గా ఉన్నాడు. అతను రవీంద్రభారతి విశ్వవిద్యాలయం, నిఖిల్ భారత్ బంగా సాహిత్య సమ్మేళన్ లకు చైర్మన్, అధ్యక్ష బాధ్యతనను నిర్వహించాడు. అతను భంగియా సాహిత్య పరిషత్ కు పూర్వపు ట్రస్టీ సభ్యునిగా ఉన్నాడు. ఆసియాటిక్ సొసైటీ ప్లానింగ్ బోర్డుకు తన సేవలనంచించాడు.[9] భారత రాష్ట్రపతి2012 జూన్ 15న ముఖర్జీ అనేక రాజకీయ ఎత్తుగడల తరువాత యు.పి.ఎ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయబడ్డాడు.[33][34] ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక 2012 జూలై 19 న జరగాలని, ఫలితాలను 2012 జూలై 22 న ప్రకటించాలని ఉంది. 81 మంది ఇతర సభ్యులు ఎన్నికలలో పోటీచేస్తూ నామినేషన్లు వేసారు. కానీ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్. డి. ఎ) ప్రతిపాదిత అభ్యర్థి పి.ఎ.సంగ్మా నామినేషన్ తప్ప మిగిలినవన్నీ తిరస్కరించబడ్డాయి.[35] అతను జూన్ 28 న నామినేషన్ వేయడం కోసం 2012 జూన్ జూన్ 26 న తన మంత్రి పదవికి రాజీనామా చేసాడు.[36] ఎన్నికలలో అతను 713,763 ఓట్లను సాధించగా, సంగ్మాకు 315,987 ఓట్లు వచ్చాయి.[37] ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే అతను తన నివాసం బయట విజయం ప్రసంగం చేసాడు. ఆ ప్రసంగంలో:
ముఖర్జీ 2012 జూలై 25న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తిచే భారత 13వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసాడు.[39] అతను ఈ పదవి నిర్వహించిన వారిలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి.[18] కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అప్పటి ప్రధాన మంత్రి మన్ మోహన్ సింగ్లు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.[40] పూర్వపు కమ్యూనిస్టు నాయకుడు సోమనాథ్ ఛటర్జీ ముఖర్జీని "భారతదేశ ఉత్తమ పార్లమెంటేరియన్, రాజనీతిజ్ఞుడు"గా కొనియాడి "ఉన్నత పదవిలో అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తి వచ్చాడు" అని తెలిపాడు.[41] ప్రతిపక్ష నేత శరద్ యాదవ్ "దేశానికి ప్రణబ్ ముఖర్జీ లాంటి అధ్యక్షుడు అవసరం." అని వ్యాఖ్యానించాడు.[42] ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ముఖర్జీ "తెలివైన అధ్యక్షుల్లో ఒకరు" అని వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష శ్రేణులలోని పార్టీలు ముఖర్జీకి మద్దతు ఇచ్చాయని ఆమె మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో "ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడిగా ఓటు వేయాలని కోరుకున్నందుకు ఎన్.డి.ఎ విడిపోయింది".[43] భారతీయ జనతా పార్టీ తమ లెజిస్లేటివ్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడాన్ని చూసి షాక్ కు గురైంది.[44] అయినప్పటికీ బి.జె.పి అధ్యక్షుడు నితిన్ గడ్కరి ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపాడు. నితిన్ "భారతదేశపు కొత్త రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రకటించాడు. గట్కారీ "ఈ దేశం మరింత అభివృద్ధి, పురోగతి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను అతనికి విజయం, ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు.[45] జీ న్యూస్ ఈ విధంగా వ్యాఖ్యానించింది: "ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిన తరువాత, అధ్యక్షుడిగా ప్రణబ్ ముఖర్జీని యుపిఎ ఎంపిక చేసి ప్రకటించిన తరువాత ప్రతిపక్షానికి అతనికి వ్యతిరేకించేందుకు ఏ వాదనలూ లేవు". అయినప్పటికీ కొన్ని అవినీతి కేసుల్లో అతను ఉన్నట్లు అన్నా బృందం కోలాహలం చేసింది. ఒకసారి సోనియా గాంధీ అతని పేరును ప్రతిపాదించిన తరువాత, అనేక మిత్ర పక్షాలు, ప్రతిపక్షం ఒక వేదికపైకి వచ్చాయి. ఇక వామపక్షాల్లో కూడా రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. వామపక్షాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనే భావనలో ఉండే సిపిఎంకు సిపిఐ షాకిచ్చింది. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగా సిపిఐ ససేమిరా అనడంతోపాటు తటస్థంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఎస్‌పి కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎ భాగస్వామిగా వున్నా జె.డి. (యు), శివసేనలు సంగ్మాను కాదని ప్రణబ్‌కే మద్దతు ప్రకటించాయి.[17] 2013 ఫిబ్రవరి 3 న క్రిమినల్ చట్ట (ఎమెండ్‌మెంటు) ఆర్డినెన్సు అతనిచే ప్రకటించబడింది. ఇది లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ ఏక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973 లను సవరణ చేస్తుంది.[46][47] 2015 జూలైలో ప్రణబ్ ముఖర్జీ 24 క్షమాభిక్ష పిటీషన్లను తిరస్కరించాడు. వాటిలో యాకూబ్ మెమన్, అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు పిటీషన్లు కూడా ఉన్నాయి.[48][49] 2017 జనవరిలో అతను 2017 రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రకటించాడు. వయసు పైబడినందువల్ల, ఆనారోగ్యం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. వ్యక్తిగత జీవితంప్రణబ్ ముఖర్జీ 1957 జూలై 13 న సువ్రా ముఖర్జీని వివాహమాడాడు. ఆమె బంగ్లాదేశ్ లోని నరైల్ ప్రాంతానికి చెందినది. ఆమె తన 10 వయేట కోల్‌కతా వలస వచ్చింది.[50] ఈ జంటాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.[9] సువ్రా 2015 ఆగస్టు 18న తన 74వ యేట గుండెపోటుతో మరణించింది.[51] అతను డెంగ్ జియావోపింగ్ చే ప్రేరణ పొంది అతనిని చాలా తరచుగా ఉదహరిస్తుంటాడు.[52] అతని హాబీలు చదువు, తోటపని, సంగీతం.[9] అతని పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ లోని జంగిపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. తన తండ్రి ఖాళీ చేసిన ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కుమారుడు పోటీ చేసి గెలుపొందాడు. పార్లమెంటు సభ్యునిగ ఎన్నిక కాకకుందు అభిజిత్ బీర్భుంలో నల్‌హటి నుండి శాసన సభ్యునిగా ఉన్నాడు.[53] ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీ కథక్ నాట్యకళాకారిణి, భారతీయ జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.[54] మిరాఠీ గ్రామంలోని తన పూర్వీకుల గృహంలో పతీ సంవత్సరం ముఖర్జీ దుర్గా పూజను నిర్వహిస్తుంటాడు.[55] నాలుగు రోజులు జరిగే ఆచారాలు, పూజల కోసం ప్రతీ సంవత్సరం మిరాఠీ గ్రామానికి వెళుతుంటాడు. 2011 అక్టోబరు 4 న జరిగిన పూజా ఉత్సవంలో ముఖర్జీ "నా ప్రాంతంలో ప్రజలను గెలిపించడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను" అని తెలిపాడు.[55] మరణంతనకు కోవిడ్-19 వ్యాధి వచ్చినట్లుగా ప్రణబ్ ముఖర్జీ, 2020 అగస్టు 20 న ట్విట్టర్లో ప్రకటించాడు. ఆ తరువాత బాత్‌రూములో జారి పడినందున సైనిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మెదడుకు ఆపరేషను జరిగింది. ఆ తరువాత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షనుతో 2021 ఆగస్టు 31 న ప్రణబ్ మరణించాడు. పురస్కారాలుముఖర్జీ అనేక ప్రశంసలు, గౌరవాలను అందుకున్నాడు: జాతీయ పురస్కారాలు
విదేశీ పురస్కారాలు
విద్యా గౌరవాలు
ఇతర గుర్తింపులు
నిర్వహించిన పదవులుప్రణబ్ ముఖర్జీ కాలక్రమానుసారం స్థానాలు:[9]
రచనలు
ఇవి కూడా చూడండిమూలాలు
బయటి లింకులువికీమీడియా కామన్స్‌లో Pranab Mukherjeeకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
|